||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది ఆరవ సర్గ ||

||"దూతో రామస్య ధీమతః" !||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షట్ర్త్రింశస్సర్గః

తత్త్వదీపిక
"దూతో రామస్య ధీమతః"

విశ్వాసము కలిగించు హనుమంతుని మాటలు వినిన సీత,
-"ముమోచ ఆనందజం జలమ్"
అంటే ఆనందముతో కూడిన కళ్ళనీళ్ళను విడిచెను,
అని ముప్పది ఐదవ సర్గలో వింటాము.

సీతాదేవికి నమ్మకము కలిగింది అని గ్రహించిన హనుమంతుడు,
సీతాదేవికి మరింత నమ్మకము కలిగించడానికి
మళ్ళీ "దూతో రామస్య ధీమతః" అంటూ,
తను రాముని దూతను అని చెప్పి
"రామనామాంకితం అంగుళీయకం పశ్య"
అంటూ రాముడి పేరుతో వున్న అంగుళీయకము సీతాదేవికి ఇచ్చెను.

అక్కడ హనుమంతుడు చెప్పిన మాట, ఆ శ్లోకము ఇది:

"వానరోsహం మహాభాగే దూతో రామస్య ధీమతః
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం|
ప్రత్యయార్థం తవానీతం త్వ దత్తం మహాత్మనా
సమాశ్విసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి"||

అంటే
"అమ్మా ! నేను వానరుడను.
ధీమంతుడగు రాముని దూతను.
రామనామాంకితమగు ఈ ఉంగరమును చూడుము.
ఈ ఉంగరము రాముడొసంగినాడు.
నీకు నమ్మకము కలిగించుటకై తెచ్చితిని.
ఆశ్వాసము నందుము.
ఇంక నీ దుఃఖము క్షీణించును.
నీకు మంగళమగుగాక"

ఈ శ్లోకము చదివి, రామునకు అర్ఘ్యపాద్యములను హారతి ఇచ్చి
తరువాత పారాయణ చేయవలెను అంటారు పెద్దలు.
అంటే ఈశ్లోకము సుందరకాండ పారాయణము ప్రారంభములో,
జరిగే పూజలో చదవ వలసిన శ్లోకము అన్నమాట.

ఈ శ్లోకములో హనుమ సీతమ్మకి
రామనామాంకితమైన వుంగరము సమర్పిస్తాడు.
అలా వుంగరము ఇవ్వడములో
ముముక్షువునకు మార్గము చూపు ఆచార్యస్వరూపము గోచరిస్తుంది.

ముముక్షువు ముందుగా భగవత్ కథను వినవలెను.
తరువాత భగవంతుని దివ్యమంగళ విగ్రహసౌందర్యమును గుణములను ఎఱుంగవలయును.
వానిచే ఆకృష్టుడైనవానికి భగవంతుని పైన,
ఆ అనుభవము కలిగించిన ఆచార్యులపైన ప్రీతికలుగును.
ఆ విధముగా ముముక్షువు ప్రీతిచే భగవంతుని అభిముఖమైన తరువాత,
ముముక్షువునకు భగవంతునిపై ప్రీతి కలిగినదని గ్రహించిన ఆచార్యుడు,
తన స్వరూపమును తన వృత్తాంతమును శిష్యునకు ఎఱింగించును.
భగవదనుగ్రహము తనకెట్లు కలిగినది,
భగవదనుగ్రహము తనకు ఎట్లు లభించినది అను విషయములను శిష్యునకు ఎఱింగించును.
శిష్యునకు పరిపూర్ణమైన విశ్వాసము ఏర్పడిన తరువాత,
భగవదనుగ్రహముచే లభించిన మంత్రము ఆచార్యుడు శిష్యునకు అందించును.
మంత్రముచెప్పడము అంటే జ్ఞానోపదేశమే.
ఇది ఆచార్య శిష్యుల జ్ఞానోపదేశ క్రమము.

సీతకు రామనామాంకిత అంగుళీయ ప్రదానాములో హనుమ ఈ క్రమమునే పాటించెను.

హనుమ చెట్టుపైనుండి చాలాసేపు సీతమ్మను పరీక్షించును.
తరువాత సీతా రావణసంవాదమై ఆర్తితో సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడినప్పుడు,
హనుమ రామకథను వినిపించెను.
తరువాత సీతమ్మకి కనపడి,
రాముని దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును ఆత్మగుణములను వర్ణించెను.
తరువాత తమకు రామునితో కలిగిన పరిచయమువివరించెను.
అప్పుడు సీతకు పూర్తిగా నమ్మకము కలిగినది.
అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన శిష్యునకు,
భగదనుగ్రహముచే లభించిన మంత్రమును ఆచార్యుడు ఒసంగినట్లు
పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన సీతకు
హనుమ రామనామాంకితమైన ఉంగరము సమర్పించెను.
అంటే ఆ రామనామాంకిత అంగుళీయకమే మంత్రము ఇక్కడ.

నమ్మకము కలిగించుటకు రామనామాంకిత ఉంగరము నీయవలసిన అవసరము లేదు.
నమ్మకము కలిగించుటకు ఉంగరము ముందే ఇచ్చివుండవచ్చు కూడా.
కాని హనుమ అట్లా చేయలేదు.
ఇక్కడ శిష్యునకు జ్ఞానము ఉపదేశించుటలోని క్రమమునే హనుమ ప్రదర్శించెను.

ఈ శ్లోకము మొదటిలోనే "వానరోsహం" అంటూ మొదలెడతాడు.
అంటే 'నేను వానరుడను' అని.
వానరః అనే మాటలో నరుడి వా ? అన్న ధ్వని వినిపిస్తుంది.
భగవదనుగ్రహ పాత్రులగు మహాపురుషులే వానరులు.
ముందుగా భగవదనుగ్రహముచే జ్ఞానము పొందిన హనుమ,
తను ఈ శరీరమునందున్నవాడని చెప్పెను.

హనుమ సీతమ్మను మహాభాగే అని సంబోధించెను.
భగవదనుగ్రహపాత్రురాలగుట అనెడి మహా అదృష్టము కలది సీత అని.
భగవదనుగ్రహము ప్రసరించిన వానికే ఆచార్యుడు లభించును.
కావున ఆచార్యుడు లభించిన శిష్యుడు మహాభాగ్యశాలి.
అదే సీతమ్మను - 'మహాభాగే' అనడములో విశేషము.

ఆచార్యుడు భగవంతుని సందేశమును
ముముక్షువు అగు శిష్యునకు - జీవునకు అందించును.
ఇక్కడ ఆచార్యుడు దూత.
హనుమ కూడా దూత .
ఎవరి దూత?
'రామస్య ధీమతః'- ధీమంతు డైన రామునకు దూత.
రామ అనుటచే ఆనంద స్వరూపుడని,
ధీమాన్ అంటే జ్ఞానగుణకుడుఅని
అంటే జ్ఞానానందస్వరూపుడగు వాని దూత అని.
జ్ఞానానంద స్వరూపుడు అంటే పరమాత్మ.
ఆంటే పరమాత్మ యొక్క దూత అని కూడా ధ్వని వస్తుంది.

భగవదనుగ్రహముచే పొందిన మంత్రమును,
ఆచార్యుడు శిష్యునకు ఉపదేశానుసారముగా సమర్పించును.
అదే క్రమము పాటించిన హనుమ,
రామానుగ్రహముచే పొందిన రామానామాంకిత ఉంగరమును
సీతా దేవికి సమర్పించును.

ఆచార్య శిష్య క్రమములో ఆచార్యుడొసగిన మంత్రమే భగవత్ సాక్షాత్కారము చేయు సాధనము.
ఆ మంత్రమే భగవంతుడే రక్షకుడు అను జ్ఞానమును ప్రసాదించును.
ఆ మంత్రమే భగవత్ అనుభూతిని కలిగించును.
ఆ మంత్రము ద్వారా దుఃఖములు పోవును.

సీతకు ఆ రామనామాంకిత ఉంగరము చూచిన వెంటనే
రాముడే సాక్షాత్కారముగా తన ఎదుట వున్నాడా అని అనిపించెను.
ఉంగరము రామునిచే ఒసంగబడినది.
హనుమంతుని చే తేబడినది.
అది సీతమ్మకి ఒసంగబడినది.
ముముక్షువునకు మంత్రము లభించగా దుఃఖములు పోవు రీతిన
సీతమ్మకు ఉంగరము లభించినంతనే ఓదార్పు లభించును.

ఇదే ఆ శ్లోకము లో కూడా మనము వింటాము.

"గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తు కరవిభూషణం|
భర్తారమివ సంప్రాప్తా జానకీ ముదితాsభవత్|"|

ఆ కరవిభూషణము అంటే వుంగరము.
ఆ వుంగరము "గృహీత్వా" అంటే తీసుకొని ,
జానకి భర్తనే పొందినదా అనే అనుభూతి పొందినది.

కర విభూషణము అనడములో ధ్వని, కరము గురించి.
కరము అంటే హస్తము, పనిచేయుటకు సాయపడునది.
భగవంతుని కరము సూచించేది రక్షణ.
అది జగద్రక్షణ.
జగద్రక్షణ చేయునది పరమాత్మయే.
కరవిభూషణము అనే మంత్రము ద్వారా పరమాత్మయే రక్షకుడను జ్ఞానము కలుగును.

సృష్టి స్ఠితి లయములు మూడును జగద్రక్షణయే.
ఈ మూడు చేయు పరమాత్మయే జగద్రక్షకుడు అను జ్ఞానము కలుగుటకు సాధనము ఏమిటి?
ఆచార్యుడు ఒసంగిన మంత్రమే ఇందుకు సాయపడును.

ఓమ్ నమో నారాయణాయ అనే మంత్రములోని ప్రణవము ఓం కారము.
ప్రణవము జీవుడు పరమాత్మకే చెందిన వాడు అను అర్థమును సూచించును.
దాని వివరణ "నమో నారాయణాయ" అను మిగిలిన మంత్రము.
పరమాత్మ ఒసగే రక్షకత్వమును గ్రహించి,
ఆ పరమాత్మమీదే భారము వేయుట మంత్రము లభించిననాడు లభించును.
ఆ మంత్రము మననము చేయగా మానసికముగా భగవంతుడు కనపడినట్లే అగును.
దాని వలన ఆనందము లభించును.

కరవిభూషణమైన ఆ అంగుళీయకము లభించగనే సీతమ్మ ఆనందభరితురాలయెను.

ఆ సంతోషములో సీత హనుమంతుని మీద మూడు మాటలు చెపుతుంది.

"విక్రాంతః త్వం"
సమర్థః త్వం"
ప్రాజ్ఞః త్వం"

ఈ మూడు హనుమంతుని లక్షణములు.
ఈ మూడింటిచేత హనుమ బలము శక్తి జ్ఞానము కలవాడని మళ్ళీతెలియుచున్నది.
జ్ఞానము బలము శక్తి మూడూ గురువు నకు ఆవశ్యకము.
రాజస తామసములగు ప్రకోపములు గల శరీరమును వశపరచుకొనుటకు
జ్ఞానము అవసరము.
తాను ఏకాకి గా ఉండియూ బలిష్ఠములగు మనస్సును బుద్ధినీ వశపరచుకొనుటకు
సామర్థ్యము అవసరము.
వాటిని అదిమిపెట్టి వుంచుకొనుటకు
బలము అవసరము.
ఇట్లు జ్ఞానము శక్తి బలములు కలవాడని సీతమ్మ హనుమంతుని ప్రశంసించెను.

సుందరకాండలో హనుమంతునిది ముఖ్యపాత్ర.
హనుమంతుడు ఎన్ని ఆటంకములు వచ్చిన ముందుకు పోతూ
సంసార సాగరములో ఎలా పోవాలో నిరూపించి చూపిన వాడు.
అట్టి వాడికి ముఖ్యలక్షణములు బలము జ్ఞానము శక్తి.
అదే సీతా దేవి చెప్పిన మాట.
అవే మనకి కావలసినవి కూడా.

ఇక మకరాలయమైన నూరుయోజనములు కల సాగరమును అవలీలగ దాటి,
దుర్భేద్యమైన రాక్షస పదమునకు చేరిన హనుమ,
సామాన్యుడైన వానరుడు కాడని సీతకి అర్థము అవుతుంది.
రామనామాంకిత అంగుళీయకముతో,
హనుమ రాముని చేత పంపబడిన వాడని తెలుస్తుంది.
రామునిచే పంపబడినవాడు కనక మాట్లాడడానికి తగినవాడని సీతకి విదితమౌతుంది.

ఇక అప్పటిదాకా మనస్సులో మసలుతున్న ప్రశ్నలన్నీ
వెంటనే ఉప్పి పొంగిన నదీ ప్రవాహము లాగా వస్తాయి.
ఆ ప్రశ్నలే వింటాము.

' ఓ హనుమా ! నా అదృష్టము కొలదీ
ధర్మాత్ముడు సత్యసంగరుడు అయిన రాముడు క్షేమముగా ఉన్నాడు.
అలాగే మహాతేజోవంతుడైన సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు కూడా'.

' మరి కుశలుడైన కాకుత్‍స్థుడు
కాలాగ్నివలె మండుతున్న కోపముతో
సాగరముతో చుట్టబడిన ఈ భూమిని ఎందుకు దహించివేయుటలేదు?
లేక సురులను కూడా నిగ్రహించకల శక్తిమంతులు
నాదుఖమునకు అంతులేదని తలచుచున్నారా?'
'రాముడు వ్యథలో నుండెనా?
పరితపించుటలేదు కదా ?
ఆ పురుషోత్తముడు చేయవలసిన కార్యములు చేయుచున్నాడా?
ఆ రాజకుమారుడు దీనుడుగా భ్రాంతిలో లేడు కదా?
కార్యములో విముఖతలేదు కదా?
పురుషకార్యములు నెఱవేర్చుచున్నాడు కదా"

'ఆ పరంతపుడు మిత్రులపై ఆదరముతో
రెండు ఉపాయములు అనబడు సామదానములను,
అలాగే శత్రువులపై విజయకాంక్షతో
మూడు ఉపాయములు అనబడు దాన భేద దండో పాయములను పాటిస్తున్నాడు కదా?
మిత్రులను సంపాదించుచున్నాడా?
మిత్రులు కూడా అతనిపై కోరికగలవారై ఉన్నారా?
మిత్రులు కల్యాణము కోరుకొనువారే కదా?
మిత్రులచేత గౌరవింపబడుతున్నాడా?

' ఆ పార్థివాత్మజుడు దేవతలను ప్రసాదించుచున్నాడా?
పురుషకార్యములు దైవకార్యములు చేయుచున్నాడా?
రాఘవుడు ఎడబాటులో నా పై స్నేహము లేనివాడు కాదు గదా?
ఓ వానరా నన్ను ఈ కష్టములనుంచి విముక్తి కలిగిస్తాడు కదా ?
ఎల్లప్పుడు సుఖములకు తగిన అసుఖములను ఎఱగని రాఘవుడు
దుఃఖములలో మునిగిపోలేదు కదా?'

' కౌసల్యయొక్క సుమిత్ర యొక్క అలాగే భరత శతృఘ్నుల
కుశలక్షేమముల గురించి వింటున్నాడు కదా?
మానార్హుడైన రాముడు నాకోసమైన దుఖములో అన్యమనస్కుడు కాలేదు కదా?
నన్ను ఎప్పుడు రక్షించును?
భాత్రువత్సలుడైన భరతుడు
మంత్రులచేత రక్షింపబడు శత్రుభయంకరమైన అక్షహౌణి సైన్యములను
నా కొఱకై పంపునుకదా?'

వానరాధిపతి అయిన సుగ్రీవుడు
దంతములు నఖములు ఆయుధముగా గల వానరసైన్యములతో కలిసి ఎప్పుడు వచ్చును?
శూరుడు సుమిత్రానందవర్ధనుడు అగు లక్ష్మణుడు
తన అస్త్రజాలముతో రాక్షసులను ఎప్పుడు వధించును?
జ్వలించుచున్న రౌద్రశస్త్రములతో
రణములో మిత్రబాంధవులతో హతమార్చబడిన రావణుని
అచిరకాలములో చూడకలను కదా?

' బంగారు వన్నెకల పద్మసమానగంధము కల
ఆయన వదనము నా వియోగ శోకముతో
జలక్షయముతో వాడగొట్టబడిన పద్మము వలె వాడిపోలేదు కదా?

ధర్మపాలనకై రాజ్యమును త్యజించినపుడుగాని,
కాలినడకన అరణ్యములో ప్రవేశించినఫుడుగాని
వ్యధచెందక భయము లేక శోకములేక వున్న వాడు,
ఇప్పుడు ఇంకా హృదయములో ధైర్యము కలవాడై ఉన్నాడు కదా?
నాతండ్రి అనురాగముకాని,
నా తల్లి అనురాగముకాని,
విశిష్ఠమైన ఆయన అనురాగముతో సమానము కాదు.
ఓ దూతా ! నా ప్రియుని వృత్తాంతము వినుటవఱకే నేను జీవించుటకు కోరుచున్నాను'.

సీతాదేవి ఆ హనుమకు
మధురమైన మహత్తరమైన అర్ధము కల ఈ వచనములను చెప్పి
ఆ రాముని గురించి మనోహరమైన మాటలు మరల వినగోరి విరమించెను.

హనుమంతుడు సీతయొక్క వచనములను విని
శిరస్సు తో అంజలి ఘటించి ప్రత్యుత్తరముగా ఇట్లు చెప్పెను.

' ఓ కమలలోచనా నీవు ఇక్కడ ఉన్నావు అని రామునికి తెలియదు.
అందువలనే ఇంద్రుడు శచీదేవిని తీసుకుపోయినట్లు నిన్నుతీసుకుపోలేదు.
నా మాటలు వినిన వెంటనే,
రాముడు వానర గణములతో కూడిన మహత్తర సైన్యముతో ఇక్కడికి వచ్చును.
కాకుత్‍స్థుడు నీటితో నిండిన సాగరమును స్థంబింపచేసి
ఈ లంకాపురమును రాక్షసరహితము చేయును'.

' ఆ రాముని మార్గములో యముడితో సహా దేవతలు ఉన్నా వారిని కూడా వధించును.
ఆర్యుడైన రాముడు నీ వియోగముతో శోకములో మునిగి,
సింహము ముందు పడిన ఏనుగు లాగ అశాంతిలో ఉన్నాడు'.

'ఓ దేవీ వింధ్యా మేరు పర్వతముల పై,
భుజింపతగు మూలఫలములపై ప్రమాణము చేసి చెప్పుచున్నాను.
అందమైన నయనములతో పెదవులతో మంచి కుండలములను దాల్చి,
ఉదయించిన పూర్ణచంద్రుని ముఖము బోలియున్న
రాముని ముఖము త్వరలో నే చూచెదవు'.

'ఓ వైదేహీ, ఐరావతము మీదకూర్చుని వున్న ఇంద్రునివలె,
ప్రస్రవణ పర్వతము మీద రాముని త్వరలోనే చూచెదవు.
రాఘవుడు మాంసము తినుటలేదు.
మధు సేవనము కూడా చేయుటలేదు.
నిత్యము వనములో దొరికిన భుక్తిలో ఐదవభాగమే తినుచున్నాడు.
రాఘవుడు నీ ఎడబాటుతో మనోసరోవరములో మునిగిపోయి,
శరీరమునుండి కీటకములను పురుగులను తోలుటలేదు'.

' రాముడు నిత్యము శోకములో మునిగియుండి
నీ పై ధ్యానపరుడై కామవశములో ఇంక దేనిగురించి ఆలోచించుటలేదు.
రాముడు ఎల్లపుడు నిద్రలేనివాడై,
నిద్రిస్తున్నాగాని సీతా అని మధురమైన వాణితో పలుకుతూ మళ్ళీ లేచినవాడగును.
ఫలము పుష్పము లేక ఏదైనా మనోహరమైనది చూచినా
'హా ప్రియా' అంటూ నిట్టూర్పులు విడుచును'.

'ఓదేవీ మహాత్ముడైన ఆ రాజకుమారుడు
నిత్యము పరితాపములో నుండి "సీతా" అని తలచుకుంటూ
నీతోనే మాట్లాడతలచి ధృఢవ్రతుడై
నిన్ను పొందుటకు అన్నివిధములుగా ప్రయత్నిసున్నాడు'.

రాముడు నిత్యము తనకోసమే శోకములో వున్నాడు అన్నమాటవిని,
రాముని శోకముతో సమానమైన శోకముగల ఆ వైదేహి
హనుమంతుని రామసంకీర్తనతో,
మేఘములతో కప్పబడి ప్రకాశించీ ప్రకాశించని శరత్ కాల చంద్రునివలె ప్రకాశించెను.

"దూతో రామస్య ధీమతః" అంటూ
తన పరిచయము చేసుకున్న హనుమ ,
రాముని శోకము కూడా వివరించి
సీత మనస్సులో రాముడు సుఖముగా ఉన్నాడన్నమాటతో ఆనందము,
తనకోసము అత్యంత శోకములో ఉన్నాడన్న మాటతో దుఃఖము కలిగిస్తాడు.
ఆ విధముగా ఒకే సమయములో సుఖదుఃఖాలతో కలత పడిన సీత ,
మేఘాలలో కనపడీ కనపడకపోయిన చంద్రుని వలె ప్రకాశించుచున్నది అంటాడు కవి.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఆరవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||